హైదరాబాద్ లో భారీ వర్షం... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

  • తెలంగాణకు రెండ్రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ
  • ఈదురుగాలులకు కూలిన చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా, రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, మంగళవారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగనుంది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం

గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీకాపూల్, సరూర్‌నగర్, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బాగ్ లింగంపల్లి, రాంనగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

ఈదురు గాలుల ధాటికి రాంనగర్ వీఎస్టీ రోడ్డు, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముషీరాబాద్‌తో పాటు నగరంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Hyderabad Rains
Telangana Weather Alert
IMD Yellow Alert
Southwest Monsoon
Heavy Rainfall
Thunderstorm Warning

More Telugu News